నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న వైషమ్యాలు మరోసారి బయట పడ్డాయి. అంరంగవైభవంగా జరిగిన బాలయ్య కూతురి పెళ్లిలో ఒక్కటే లోటు… ఎన్టీఆర్ రాకపోవడం. అసలు బాలకృష్ణ కూతురి పెళ్లి విషయం తెలియగానే అందరి ప్రశ్నా ఒక్కటే – ఈ పెళ్లికి ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందుతుందా? అందితే వస్తాడా?? అని. వస్తాడని కొందరు, రారని కొందరు పందేలు కూడా వేసుకొన్నారు. చివరికి ఎన్టీఆర్ రాలేదు. దాంతో మాట్లాడుకోవడాని కావల్సిన పసందైన టాపిక్ దొరికేసింది. ఆహ్వానం అందినా ఎన్టీఆరే కావాలని పెళ్లికి రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ పత్రిక ఆలస్యంగా అందిందనే నెపంతో ఎన్టీఆర్ ఈ పెళ్లికి హాజరు కాలేదు. ఎప్పుడైతే శుభలేఖ అందిందనే విషయం తెలిసిందో తప్పు తనవైపు ఉండిపోయింది. దీనికి ఎన్టీఆర్ ఎలా సమాధానం చెప్పుకొంటాడు??
బాబాయ్‌కు ఉన్న కోట్లాదిమంది అభిమానుల్లో నేనూ ఒకడిని, నేనే మొదటివాడిని – అని గర్వంగా చెప్పుకొంటాడు ఎన్టీఆర్. అలాంటిది బాలకృష్ణ నా అభిమానులంతా పెళ్లికి రావాల్సిందే అన్నప్పుడు ఓ అభిమానిగా ఎన్టీఆర్ ఈ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు అనేది స్వయంగా ఎన్టీఆర్ అభిమానుల ప్రశ్న. ఎన్టీఆర్ పెళ్లికి మండపం దగ్గర సందడి చేశాడు బాలయ్య. అతిథులను సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. ఆ రోజులు ఇంకా గుర్తే. మరి.. బాలయ్య ఇంట్లో పెళ్లి జరిగితే వెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌కి లేదా??
బాలయ్య, చంద్రబాబులకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఓ కోటరీ నడుపుతున్నాడని చెప్పుకొంటున్నారు, లోకేష్‌కి ధీటుగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడని, నందమూరి తారక రామారావు అసలైన వారసుడిని నేనే అని చెప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడని బయట రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి నేనే తెలుగు దేశం పార్టీ వాడినే అని సగర్వంగా చెప్పాడు ఎన్టీఆర్. మరి ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకొన్నాడు? బాబాయ్‌కీ నాకూ మనస్ఫర్థలు లేవు అని మైకు పట్టుకొని మాట్లాడితే సరిపోతుందా? అది నిరూపించుకోవలసిన సమయం వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. కానీ ఎన్టీఆర్ ఏం చేశాడు? బాబాయ్ ఇంట్లో పెళ్లి జరుగుతోంటే షూటింగ్ పనుల్లో పడిపోయాడు. రేపో, మాపో ప్రెస్ మీట్ పెట్టి – మేమంతా ఒక్కటే , మీడియానే లేనిపోనివి రాస్తోంది అన్నా అనొచ్చు. కానీ ఏం జరిగిందో జనం చూస్తూనే ఉన్నారు. లోలోపల ఎన్ని విబేధాలున్నా, ఎంత కొట్టుకు చస్తున్నా, ఎన్ని వైషమ్యాలున్నా పెళ్లి కదా.. వచ్చి, నాలుగు అక్షతలు వేసి వెళ్లిపోతే ఎన్టీఆర్‌కి హుందాగా ఉండేది, ఈ మాటలు వినే బెడద తప్పేది. ఎన్టీఆర్ ఇప్పుడు తీరిగ్గా కూర్చుని – అయ్యో పెళ్లికి వెళ్లాల్సింది అనుకొంటే ఏం లాభం.? ఇట్స్ టూ లేట్ కదా??
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి