9, మార్చి 2014, ఆదివారం

pawan rajakeeyallo panikivasthadaa?

రేపోమాపో ఎన్నికల బరిలోకి దిగబోతున్న పవన్ కళ్యాణ్‌కు నిజంగా అంతసీన్ వుందా..? సరిగ్గా ఐదారేళ్ల క్రితం ఇంతకంటే మూడునాలుగు వందల రెట్లు హైప్‌తో రాజకీయరంగ ప్రవేశం చేసిన చిరంజీవికి పట్టిన గతే పడుతుందా..? గతంలో  సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది నటీనటుల్లో ఒకళ్లిద్దరు(ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటివాళ్లు) మాత్రమే పార్టీలు పెట్టి విజయం సాధించారు. ఇక చిరంజీవి వంటి వాళ్ల గురించి చెప్పకోవాల్సిన పనేలేదు. అనుభవరాహిత్యం, చుట్టూ ఒకరిద్దరి సాంగత్యం వంటి కారణాలతో రాజకీయాల్లో బొక్కబోర్లాపడ్డ వైనాలే అధికం. పైగా సినిమా రంగంలో చిరంజీవి వంటి వాళ్లకున్న ఇమేజ్, అభిమానగణంతో పోల్చుకుంటే పవన్‌కళ్యాణ్‌కున్న ఫాలోయింగ్ తక్కువని చెప్పుకోకతప్పదు. పవన్‌కున్న హీరో ఇమేజ్‌తోపాటు అతనికున్న కరిష్మా తక్కువేమీ కాకపోయినప్పటికీ సినిమా సక్సెస్ ఇచ్చే కిక్ మాత్రం ‘నిజం’ కాదనేని ఒక కఠోరమైన వాస్తవం. స్ర్కిప్ట్ రైటర్స్ రాసే డైలాగులు, డైరెక్టర్లు అల్లుకునే సీక్వెన్సులు, వాటికి సినిమాహాళ్లలో ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, సదరు సినిమా ఆడియో రిలీజ్ పంక్షన్, సక్సెస్ మీట్లు, అభిమానుల రక్త తిలకాల్ని చూసుకుని ఇదంతా నిజజీవితంలో కూడా తమను అంటిపెట్టుకుని వుంటాయనే భ్రమలతో రాజకీయాల్లోకి దిగినటువంటివాళ్లు ఆ తర్వాత భంగపడిపోయిన దృశ్యాలే ఎక్కువ (తెలుగు తెరకు సంబంధించి ఎన్టీఆర్ వంటి వాళ్లు కూడా ఒకస్థాయిలో తిరుగులేని విజయం సాధించినా.. రాజకీయాల్లో కంటితడిపెట్టిన సన్నివేశాల్ని కూడా పరిగణలోకి  తీసుకోవాలి). ఇక ఇప్పుడు తన రాజకీయ అభిలాషతో తన ఇమేజ్‌ని ఎన్‌క్యాష్ చేసుకోవాలని ఉబలాటపడుతున్న పవన్‌కళ్యాణ్ విషయానికే వద్దాం. ఆయనొక్కడే రాజకీయాల్లోకి రావడం...ఇప్పుడున్న పార్టీలు వాటి నేతల్ని ఛాలెంజ్ చేయడం ఒకపద్దతైతే.. ఏకంగా పార్టీయే పెట్టి దాని తరపున తనతోపాటు తన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని వాళ్ల గెలుపుల్ని కూడా సార్థకం చేసుకోవడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా పవన్‌కి ఈ విషయంలో తన సొంత సోదరుడి అనుభవం వుండనేవుంది. ఒకవిషయం చెప్పుకోవాల్సివస్తే... పవన్ కళ్యాణ్‌కు ప్రజారాజ్యం పార్టీ చేదు జ్ఞాపకాలు - అనుభవాలు నేర్పించిన గుణపాఠాలు తక్కువేమీకాదు. ఆ పార్టీతో అతనికి చాలా విలువైన ఎమోషనల్ ఎటాచ్‌మెంట్‌తోపాటు మరిచిపోలేని ‘దెబ్బలే’ తగిలాయి.
అయితే కేవలం వాటి ప్రాతిపదిక మీద తనదైన కొన్ని అభిప్రాయాల్ని - ఆవేశాల్ని మిళితం చేసి ఏకంగా ఒక పార్టీనే పెట్టాలనుకోవడం అత్యంత సహసోపేతమైన నిర్ణయం. రజనీకాంత్ వంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌వున్న నటులు సైతం రాజకీయాల్లోకి రావటానికి సంశయించడాన్ని కూడా పవన్ వంటివాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి. కుల బలం, ధనబలంవున్న అక్కినేని నాగేశ్వరరావు వంటివాళ్లు కూడా రాజకీయాలకు దూరంగావున్న విషయాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. ఐతే, సినిమాల్లోవున్న వ్యక్తులు, హీరోలు సమాజానికి ఏదైనా చేయాలన్న పాజిటివ్ ధృక్పదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అందులో తప్పేమీలేదు. ఐతే, వాస్తవాల పునాదుల మీద ఆచితూచి అడుగువేయడం అవసరం. సినిమా హీరోలు సాధారణంగా తమ ఫ్యాన్స్ బలబలాల నేపథ్యంలోనే తమతమ ఆశల సౌధాల్ని నిర్మించుకుంటూ వుంటారు. వాటి చుట్టూనే పరిభ్రమిస్తూ వుంటారు. సినిమాల్లోని సన్నివేశాలు- డైలాగ్స్ అన్ని కూడా అటువంటి అభిమానుల్ని దృష్టిలో వుంచుకునే అల్లుకుంటూవుంటారు. ఆయా సినిమాలకు సంబంధించిన రచయితలు, గేయకారులు, చివరాఖరికి డైరెక్టర్‌తోపాటు మిగతా టెక్నీషియన్స్ అంతా ఆ హీరోదృష్టి కోణం నుంచే ఆలోచిస్తారు. ఐతే, రాజకీయ వాతావరణం మాత్రం ఇటువంటి ప్రక్రియలకు భిన్నంగా వుంటుందని అర్థంచేసుకోరు. తమ నాయకుడికి భజన చేయడం, అతని ఇమేజ్ చుట్టూ తమ కెరీర్‌ని సృష్టించుకోవడం ఒక కామన్ ఫ్యాక్టరయితే స్వార్థపూరిత ఆలోచనలు, స్థానిక పరిస్థితుల ప్రాబల్యం, డబ్బు వగైరా వగైరాలన్నీ వాళ్లను తాము నమ్మిన నాయకుడికి దూరంగా జరిపేస్తూ వుంటాయి. ప్రజల నుంచి వచ్చే ఒత్తిళ్లు, చుట్టూ రాజకీయ వాతావరణం ఇతరత్రా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు తమ పార్టీకి, నాయకుడికి దూరంగా నెట్టేస్తాయి. ఇవన్నీ పవన్ వంటి రాజకీయాభిలాషులు గుర్తుంచుకోవాల్సిన నిజాలు! ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అభిమానుల గురించి అతడు రాజకీయాల్లో పోటీ చేసేదానిపై ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకుంది. పవన్ పట్ల అతని అభిమానులు ఏమాత్రం సుముఖంగా లేరనేది దాని సారాంశం. గుంటూరు, విజయవాడలతోపాటు కొన్ని సీమాంధ్ర ప్రాంతాల్లో పవన్ రాజకీయ అరంగేట్రాన్ని వారు అంతగా హర్షించలేదు. పైగా పవన్ పేరుమీదున్న ఒక అభిమానుల వైబ్‌సైట్‌లో ‘మీరంతా రేపటి ఎన్నికల్లో పవన్ వైఫల్యం చెందిన తర్వాత ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలి’ అంటూ  రాసుకోవడాన్ని ఈ వార్తాకథనం ప్రస్తావించింది. ఇదే నిజమైతే పవన్ తనదైన అభిప్రాయాల్ని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం వుంటుందని‌పిస్తుంది! ఇవన్నీ పవన్ని రాజకీయంగా నీరుగార్చడానికి రాస్తున్న రాతలే అంటూ కొంతమంది కొట్టిపారేయవచ్చు. అయితే, కాస్త నిర్మాణాత్మకంగా తనదైన భావోద్వేగాల్ని పక్కకుపెట్టి ఆయన ఆలోచించగలిగితే బాగుంటుందంటూ ఆయన్ని ఇష్టపడే ఒకరిద్దరు సినిమా ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలివి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి