రాష్ట్ర విభజన అంశంతో గత కొంతకాలం ఆగమ్యగోచరంగా తయారైన రాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించడమా లేక రాష్ట్రపతి పాలనా విధించాలా అదీ కాకుండా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసేసి, ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడమా? అనే అంశాలపై ఢిల్లీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించింది కేంద్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంపై ఏక్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకే న్యాయనిపుణులు అధికంగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో విభజన క్రమాన్ని పూర్తి చేసి... మూడు, నాలుగు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే సముచితంగా వుంటుందటున్నారు. కానీ, రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. అయితే.. శుక్రవారమే పార్లమెంటు నిరవధిక వాయిదా పడింది. దీంతో న్యాయపరమైన చిక్కలు ఎదుర్కునే అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్రపతి పాలన ఆలోచనను పక్కన పెట్టినట్టు వాదన వినిపిస్తోంది.
మరోవైపు... ఇప్పటికిప్పుడు సీమాంధ్రలో ఎన్నికలకు వెళితే... కాంగ్రెస్‌కు చావు దెబ్బ ఖాయమని ఆ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓ ఆరునెలలు ఆగితే అవకాశాలు మెరుగవుతాయని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. అలాగే విభజన అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళితే తెలంగాణ జిల్లాల్లో పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా 'అప్పాయింట్ డే' ప్రకటించి, రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి... అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం వుంది. ఇప్పటికే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రణబ్ ముఖర్జీ సంతకం కోసం పంపారు. మొత్తానికి... ఈ అంశంపై శనివారమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి