21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ika vaatalu

రాష్ర్ట విభజన నేపధ్యంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సహజ వనరులు, నీటి పంపకాలు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, ఆదాయ వనరులు.. ఇలా ఎవరెవరు ఏమేం నష్టపోతారోనన్న భయం ఇరు ప్రాంతాల వాసుల్లో కనిపిస్తోంది. అయితే అదే సమయంలో ప్రజలకు మించిన టెన్షన్ మాకుంది అంటున్నారు కొందరు అయ్యా.. ఎస్.. (ఐఏఎస్) అధికారులు. ఇప్పటివరకు అన్ని శాఖల్లో పథకాల అమలు తీరు, జిల్లాల్లో పరిపాలన, అభివృద్ధి వంటి అంశాలని దగ్గరుండి సమీక్షిస్తూ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న తమ పరిస్థితి ఇకపై ఏం కానుంది అనే టెన్షన్ ఐఏఎస్ అధికారుల్ని వేధిస్తోంది. రాష్ర్ట విభజన తర్వాత కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ముందునుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగా వినుకొండ సమీపంలోని నల్లమల అడవుల్లోనే కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందా? ఒకవేళ అదేకానీ జరిగితే తామంతా వెళ్లి ఆ అడవుల్లో కూర్చుని ఫైళ్లు తిప్పేయాల్సిందేనా అనేది వీరి ఆందోళనట. అసలే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోళ్లం... ఎక్కడికి పంపించినా నో చెప్పకుండా.. నోరెత్తకుండా మూటముళ్లె సర్దుకుని వెళ్లాల్సిందే.
అందుకే తమకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో ఏమోననే భయం తమని వెంటాడుతోందని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకాయన వాపోయారు. ఈ మాటలు ఆయనొక్కరే అంటున్నవి కావు.. సెక్రటేరియట్ సర్కిల్స్‌లో దాదాపు 130 మంది ఐఏఎస్ అధికారులు బిక్కుబిక్కుమంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్న అభిప్రాయం. ఇక నాన్ లోకల్ ఐఏఎస్‌ల పరిస్థితి మరో రకంగా వుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడిప్పుడే '' అమ్మా.. నాన్న.. అక్క.. చెల్లి..'' అంటూ చిన్నగా తెలుగు నేర్చుకుని హమ్మయ్య అనుకుంటున్న తరుణంలో తమని మళ్లీ తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారోననేది వారి భయమట. ప్రజా పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమని ఈ విషయంలో ప్రభుత్వం గుర్తిస్తుందా? తమ అభిప్రాయానికి విలువిస్తుందా? తమ గొంతు ఏం చెబుతుందో, ఏం కావాలంటుందో వినిపించుకునేవాళ్లెవరయినా వుంటారా అని వాళ్లు ఆలోచనలో పడ్డారు. మరి వీళ్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అంటే.. '' ఏమో!  డౌటే'' అనే సందేహం సమాధానంగా వస్తోంది. ఏం జరగనుందో జస్ట్ వెయిట్ అండ్ సీ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి