ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బడా నేతల బాగోతం బయటకొస్తోంది. ఓ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు నేతలకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అరెస్టయిన సినీనటి నీతూ అగర్వాల్ కర్నూలు పోలీసుల విచారణలో సంచనల విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో సహజీవనం నిజమేనని... అతను కొంతమంది స్మగ్లర్లతో మాట్లాడించేవాడని, తన ఎకౌంట్ ద్వారానే వారికి నగదు బదిలీలు జరిపేవాడని పోలీసుల విచారణలో వెల్లడించిందామె.
ప్రేమ ప్రయాణం మూవీ ద్వారా ఏర్పడిన పరిచయంతో తర్వాతి కాలంలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మస్తాన్ తనకు హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనివ్వడంతోపాటు కొంత నగదు మొత్తాన్ని కూడా తన పేరిట డిపాజిట్ చేశాడని నీతూ అంగీకరించింది. ఇవన్నీ పాత విషయాలే అయినా ఇప్పుడామె చెప్పినవాటిలో కొత్తవి కొన్ని రాజకీయ నేతల్లో గుబులురేపుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఇద్దరు రాజకీయ నేతలకు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని నీతూ తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో నీతూ వెల్లడించిన వివరాల ఆధారంగా సదరు నేతల జాతకాలు బట్టబయలు చేసే పనిలో పోలీసులు బిజీ అయ్యారు.